7 వ పాఠం

ఫిబ్రవరి 5-11

ఆత్మకు లంగరు వలెనుండు యేసు

ఈ వారమునకు చదువ వలసిన వచనములు:హెబ్రీ 6:4-6; మత్తయి 16:24, రోమా 6:6; హెబ్రీ 10:26-29; 6:9-13; 6:17-20.

కంఠతవచనం:”ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను” (హెబ్రీ 6:19, 20).

మన పక్షమున యేసు నిర్వహించుచున్న యాజకత్వమును గూర్చి ఇవ్వబడిన వేదాంత సంబంధమైన వివరణకు హెబ్రీ 5:11-6:20 అభ్యంతరము తెల్పుచున్నది. ఆవిధముగా చేయుట వలన క్రీస్తు నుండి వేరైపోయే ప్రమాదమున్నట్లు పాలు అక్కడ ఒక తీవ్రమైన హెచ్చరికను చేసెను. ప్రజలు తమ మీద వారే జాలిపడుతూ విశ్వాసరాహిత్యముతో నిజమైన ప్రమాదములోనికి జారుకొని వెళ్ళే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. విశ్వాసులు ఎదుర్కొనుచున్న ప్రమాదకరమైన పరిస్థితులను బట్టి వారు ఆధ్యాత్మికముగా చురుకుదనమును కోల్పోవుట వలన సువార్తను అర్ధము చేసుకొనుటలో వెనుకబడిపోవుదురేమోయని అపొస్తలుడైన పౌలు తన ఆవేదనను తెలియజేస్తున్నాడు.

మనందరికి శోధనలు ఎదురవుట వలన నిరుత్సాహము చెందే ప్రమాదములో పడి యేసుకు దూరమైపోయే పరిస్థితి ఏర్పడవచ్చునుగదా?

తీవ్రమైన హెచ్చరిక చివరికి ప్రేమతో ప్రోత్సహించే అత్యున్నత స్థితికి నడిపించింది. తన విశ్వాసులలో పౌలుకున్న నమ్మకమును చూపిస్తూ దేవుడు వారికి వాగ్దానము చేసిన రక్షణ యేసు ద్వారా అనుగ్రహింపబడుతుందని ఆయనను హెచ్చించెను (హెబ్రీ 6:9-20). ఈ విధముగా హెచ్చరించుట మరియు వారినే ప్రోత్సహించుట అనే విషయమును హెబ్రీ 10:26-39లో తిరిగి చెప్పడం జరిగింది.

యేసు మనకు అనుగ్రహించుచున్న ప్రోత్సాహకరమైన శక్తిగల మాటలను మరియు ఏ విషయాలను గూర్చి తిరిగి చెప్పబడెనో వాటిని గురించి ఈ పాఠములో చదువుకొనబోవుచున్నాము.

– ఫిబ్రవరి 12, సబ్బాతు దినమున ఈ పాఠమును అధ్యయనము చేయుటకు సిద్దపడుదుము.

దివ్య వాక్యమును రుచి చూచుట

హెబ్రీ 6:4, 5 చదువుడి. విశ్వాసులు క్రీస్తు యెడల నమ్మకము కలిగియుండుట వలన వారికేమి అనుగ్రహించబడును?

“జ్ఞానముపొందిన” అనగా మారుమనస్సు అనుభవము పొందిన అని అర్ధము (హెబ్రీ 10:32). సాతాను సంబంధమైన అంధకార శక్తి నుండి “దేవుని వెలుగువైపు” తిరిగిన వారిని గూర్చి ఇక్కడ చెప్పబడుచున్నది (అపొ.కా. 26:17,18) అనగా వారు పాపము నుండి (ఎఫెసి 5:11) మరియు అజ్ఞానమునుండి (1 థెస్స 5:4,5) విడుదల పొందిన వారై యున్నారు. వెలుగింపబడుట అనే క్రియాపదము యేసు ద్వారా సాధ్యమయ్యే దేవుని యొక్క కార్యము. ఇక్కడ యేసు దేవుని మహిమ తేజస్సుగా ఉన్నాడు (హెబ్రీ 1:3).

“పరలోక సంబంధమైన వరము” ను రుచి చూచి మరియు “పరిశుద్ధాత్మలో పాలివారై” ఈ రెండు విషయాలు సమాన పదము లేక సమానార్ధమును సూచించుచున్నవి. దేవుని వరము ఆయన కృపను సూచించుచున్నది (రోమా 5:15). లేక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపను అనుగ్రహించుచున్నాడని అర్ధము (అపొ.కా. 2:38). ఎవరైతే పరిశుద్ధాత్మను “రుచి చూచారో” (యోహా 7:37-39; 1 కొరింథి 12:13) వారు దేవుని కృపను, ఆయన చిత్తమును నెరవేర్చే శక్తిని అనుభవపూర్వకముగా తెలుసుకొనిన వారిని అర్ధము (గలతీ 5:22,23).

“దేవుని దివ్య వాక్యమును రుచి చూచుట” (హెబ్రీ 6:5) అనగా సువార్త సత్యమును వ్యక్తిగతముగా అనుభవించెను అని అర్ధము (1 పేతురు 2:2,3). రాబోవు యుగ సంబంధమైన శక్తులు అనగా విశ్వాసుల కొరకు భవిష్యత్తులో దేవుడు ప్రదర్శించు అద్భుత కార్యములను అనగా పునరుత్తానము (యోహా 5:28, 29) మన శరీరములు మార్పుచెందుట, నిత్యజీవము పొందుట వంటి విషయాలను సూచించుచున్నవి. విశ్వాసులు ప్రస్తుత కాలములోనే వాటిని రుచి చూచి తెలుసుకొనుట ఆరంభిస్తారు. వారు “ఆధ్యాత్మిక పునరుత్థానమును” అనుభవించారు. (కొలొస్స 2:12, 13). మనస్సు మారి నూతనమగును (రోమా 12:2) క్రీస్తునందు నిత్యజీవము పొందుదురు (యోహాను 5:24).

బహుశః పౌలు మనస్సులో అరణ్యములో సంచరించిన ఇశ్రాయేలు తరమువారుండి ఉంటారు. వారు దేవుని కృపను రక్షణను అనుభవపూర్వకముగా తెలుసుకున్నారు. వారు “అగ్ని స్తంభము” ద్వారా వెలిగింపబడినవారు. (నెహె 9:12, 19; కీర్త 105:39) పరలోకము యొక్క వరమైన మన్నాను అనుభవించారు (నిర్గ 16:5). పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను (నెహెమ్యా 9:20). దివ్య వాక్యమును రుచిచూచారు (యెహాను 21:45). ఐగుప్తు నుండి విమోచింపబడినప్పుడు దేవుడు చేసిన మహత్కార్యములలోను, సూచక క్రియలలోను, “రాబోవు యుగసంబంధమైన శక్తిని చూసారు” (అపొ.కా. 7:36) ఇన్ని రుజువులు వారికున్నప్పటికి, అరణ్యములో సంచరించిన ఇశ్రాయేలు తరము వారు స్వధర్మమును త్యజించి (వారి మత ధర్మమును త్యాగము చేసి) దేవుని నుండి దూరమయ్యారు (సంఖ్యా 14:1-35) దేవుని కృపను హెన్రీ విశ్వాసులు పొందుకొని కూడా అరణ్యములో సంచరించిన ఇశ్రాయేలు తరము వారివలె భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయే ప్రమాదముందని పౌలు అభిప్రాయపడ్డాడు.

హెబ్రీ పత్రికలో వ్రాయబడిన విషయాలను గూర్చి నీ వ్యక్తిగత అనుభవమేమిటి? ఈ వాక్యాలలో చూచినట్లు “వెలిగింపబడుట” అనే విషయాన్ని నీ అనుభవము ద్వారా ఎట్లు తెలుసుకొంటివి?

మరల నూతన పరచుట అసాధ్యము

హెబ్రీ 6:4-6; మత్తయి 16:24; రోమా 6:6; గలతీ 2:20; 5:24 మరియు గలతీ 6:14 చదువుడి. ఈ వాక్యములన్నింటిని పోల్చి చూచుట ద్వారా క్రీస్తును సిలువ వేయుట అంటే ఏమి అర్ధమును కనుగొన్నావు?

 ఆదిమ గ్రీకు భాషలో ఈ వాక్యమును చదివితే అందులో “అసాధ్యము” అనే మాటను నొక్కి చెప్పినట్లు ఉన్నది. ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలివారై తరువాత “తప్పిపోయిన వారిని” మరలా నూతనపరచుట దేవునికి కూడ అసాధ్యము. ఎందువలనంటే “వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు” (హెబ్రీ 6:6). క్రీస్తు ద్వారా తప్ప రక్షణ పొందుటకు వేరొక మార్గము లేదని చెప్పాలని పౌలు కోరుచున్నాడు (అపొ.కా.4:12). దేవుడు అబద్దమాడుట (హెబ్రి 6:18) ఎంత అసాధ్యమో లేక విశ్వాసము లేకుండా “దేవునికి ఇష్టుడైయుండుట (హెబ్రీ 11:6) ఎంత అసాధ్యమో క్రీస్తు ద్వారా తప్ప వేరొక మార్గములో రక్షణ పొందుట కూడా అంతే అసాధ్యమైన విషయము.

“మరల దేవుని కుమారుని సిలువ వేయుట” అని చెప్పడము ద్వారా యేసు విశ్వాసికున్న వ్యక్తిగత బాంధవ్యములో జరగకూడనిదేదో సంభవించినదని ఒక ఉపమాన రీతిలో చెప్పినట్లుంటుంది. మత పెద్దల యొక్క అధికారమును వారి యొక్క స్వేచ్ఛా స్వాతంత్య్రమును యేసు ప్రశ్నించుచున్నందున వారు ఆయనను సిలువవేసిరి. ఆవిధముగా వారికి ఒక బలమైన శత్రువు అనుకొనిన యేసును వ్యక్తిగతముగా నిర్మూలము చేయాలని ఆశించారు. అదేరీతిగా సువార్త కూడా ఒక వ్యక్తికి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్య్రమును మరియు స్వయం నిర్ణయాధికారమును సవాలు చేయుచున్నది. ఎవరైనను క్రైస్తవ జీవితమును జీవించాలనుకున్నట్లయితే అట్టివారు “తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని క్రీస్తును వెంబడించవలసియున్నది (మత్తయి 16:24). అనగా వారు లోకమునకు సిలువ వేయవలసియున్నారని అర్ధము (గలతీ 6:14) మన ప్రాచీన స్వభావమును (రోమా 6:6) మరియు శరీరమును దాని ఇచ్చలతోను, దురాశలతోను (గలతి 5:24) సిలువ వేసియున్నారు. మనము ఒకరకమైన ‘మరణమును’ పొందవలసియున్నామనునది క్రైస్తవ జీవితము యొక్క లక్ష్యమైయున్నది. ఆవిధముగా క్రైస్తవులు తమ స్వార్థ జీవితమును త్యజించి దానిని భూస్థాపితం చేసిన ‘మరణ’ అనుభవమును పొందని యెడల దేవుడనుగ్రహిస్తానన్న నూతన జీవము పొందలేము” (రోమా 6:1-11).

యేసుకు మరియు మన శరీరమునకు మధ్య జరుగుతున్న పోరాటము ఒక మరణపోరాటము వంటిది. (రోమా 8:7,8; 5:17) ఒక్క ప్రయత్నములోనే విజయము సాధించగలిగే పోరాటము కాదది. మన ప్రాచీన స్వభావముతోను మరియు శరీరముతోను ఒక వ్యక్తి చేయుచున్న పోరాటమును గూర్చి ఈ వాక్యాలు మాట్లాడుటలేదు. అయితే ఒక విశ్వాసి మనః పూర్వకముగా రక్షణయనుభవమును పొంది మరియు దానిలోని విషయాలను అర్ధము చేసుకొని (హెబ్రి 6:4,5). యేసుతో తన జీవితము కొనసాగాలంటే, లోక సంబంధమైన విషయాలను ఎన్నింటినో నెరవేర్చవలసి వస్తుందని తెలిసి యేసుతో ఉన్న తన పూర్వపు బాంధవ్యమును చంపివేయాలనుకొనే, పాపమును గూర్చి ఈ వాక్యాలు మాట్లాడుచున్నవి. అనగా ఆ వ్యక్తి క్రీస్తు నుండి పూర్తిగా తొలగిపోవాలనే కోరిక లేనంతవరకు, రక్షణను పొందే అవకాశము అతనికి లేక ఆమెకు తెరవబడే యుంటుంది.

సిలువను మోయుటకు ‘స్వార్ధమును’ చంపుకోవాలి అంటే అర్ధమేమిటి? క్రీస్తు యొక్క ఆధిపత్యమునకు అప్పగించుటకు నీకు కష్టమైన విషయమేమిటి?

పాపముల నిమిత్తము ఇక బలియర్పణ లేదు

హెబ్రి 6:4-6లో ఇవ్వబడిన హెచ్చరిక హెబ్రీ 10:26-29లో ఇవ్వబడిన హెచ్చరికకు సాదృశ్యముగా ఉంది. “యేసు చేసిన బలియాగమును తిరస్కరించిన యెడల పాపము క్షమించబడుటకు విశ్వాసికి వేరొక ఆధారము లేదు. యేసు ఒక్కడే పాపాలు క్షమించుటకు ఆధారమైయున్నాడు (హెబ్రీ 10:1-14).

హెబ్రి 10:26-29 చదువుడి. పాపక్షమాపణ లేని పాపమును గురించి గ్రంథకర్త ఏ మూడు విధాలుగా వివరించాడు?

సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొందిన తరువాత ఏదైనా పాపమును చేసిన యెడల దానికి పరిహారము లేదని గ్రంథకర్త చెప్పుట లేదు. దేవుడు మన పక్షమున మాట్లాడుటకు ఉత్తరవాదిగా యేసును నియమించెను (1 యోహాను 2:1). ఆయన ద్వారా మన పాపములకు క్షమాపణ దొరుకును (1 యోహా 1:9) ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు అనుకూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించిన యెడల అటువంటి పాపమునకు పరిహారము లేదు (హెబ్రి 10:29). ఈ విషయాలను గూర్చి అర్ధము తెలుసుకుందాము. “ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి” (హెబ్రి 10:29) అనగా యేసు యొక్క అధికారమును తిరస్కరించిన భావము కలుగుచున్నది.

“దేవుని కుమారుడు” అనే హోదా, యేసును తన కుడి పార్శ్వమున కూర్చుంబెట్టి ఆయన శత్రువులను ఆయన పాదపీఠముగా దేవుడు చేయును అనే భావాన్ని విశ్వాసులకు ఇవ్వబడినది (హెబ్రి 1:13; 1:5-12, 14 కూడా చూడుడి). ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అనగా ఒకసారి వెలిగింపబడి తరువాత క్రీస్తును విడిచి పెట్టిన వారు యేసును ఒక శత్రువుగా భావించుట వలననే వారు ఆ విధముగా చేస్తున్నారనే భావము కలుగుతుంది. అయితే ఈ పత్రిక యొక్క వాదనను బట్టి (హెబ్రి 1:13). యేసును తన సింహాసనము తొలగించి ఆయనను తన పాద పీఠముగా చేసుకోవాలని యేసును విడిచి పెట్టనివారు భావిస్తున్నారు. పరలోకములో లూసిఫరు అదే పని చేయాలనుకున్నాడు (యెషయా 14:12-14). మరియు భవిష్యత్తులో భ్రష్టత్వమునకు లోనైన వాడు చేయు ప్రయత్నము అదే (2 థెస్సలో 2:3,4).

“నిబంధన రక్తమునకు అపవిత్రమైనదిగా ఎంచి” అనే ఈ వాక్యము యేసు చేసిన బలియాగమును తిరస్కరించిన దానికి సమాధానమని అర్ధము యిస్తున్నది (హెబ్రి 9:15-22) అనగా యేసు యొక్క రక్తమును శుద్ధి చేసే శక్తి లేదని భావమును అది కలుగజేయుచున్నది.

“కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించుట” అనే ఈ వాక్యము చాలా శక్తిగలది. దీనికి సమానమైన గ్రీకు పదము “ఎనిబ్రిసాస్” (అవమాన పరచుట, దౌర్జన్యము చేయుట) అమానకరమైన స్థితిని సూచిస్తుంది. కృపకు మూలమగు పరిశుద్ధాత్మను, అవమానకరముగా వర్ణించబడినదనే భావమును కలుగజేయుచున్నది. ఆవిధముగా దేవునిని విడిచినవాడు. దేవుడనుగ్రహిస్తానని చెప్పిన కృపను అవమానపరుస్తున్నారు. భ్రష్టత్వములోనికి దిగజారిపోయిన వ్యక్తి యేసును, ఆయన చేసిన బలియాగమును మరియు పరిశుద్ధాత్మను తిరస్కరించుచున్నాడు.

మేలైన విషయాలు

హెబ్రి 6:4-8లో ఇవ్వబడిన నిష్కపటమైన మరియు తీవ్రమైన హెచ్చరికను వినిన తరువాత విశ్వాసులు కుమారుని యొద్ద నుండి ఇప్పుడు లేక భవిష్యత్తులో దూరమైపోదురనే నమ్మకమును పౌలు తెలియజేసాడు. తన విశ్వాసులు వచ్చిన హెచ్చరికను స్వీకరించి దానికి తగినట్లు ఫలములను ఫలిస్తారని అతడు నమ్మియున్నాడు. వారు దేవుని చేత సేద్యము చేయబడు ‘భూమి’ వంటి వారనియు మరియు వారు ఆయన ఆశించిన ఫలములను ఫలిస్తారని దృఢముగా నమ్మాడు. వారు “రక్షణ” అనే దీవెనను దేవుని యొద్దనుండి నిశ్చయముగా పొందుదురు (హెబ్రి 6:7; హెబ్రి 6:9).

హెబ్రి 6:9-12 చదువుడి. విశ్వాసులు చేసిన మరియు చేయబోవు మంచి విషయాలను ఒక పట్టిక రూపములో వ్రాసి వాటి అర్ధమేమిటో వివరించుము?

విశ్వాసులు భక్తులైన దేవుని సేవకులకు సేవ చేయుట ద్వారా, దేవుని యెడల మరియు ఆయన నామము యెడల వారికున్న ప్రేమను వ్యక్తపర్చేవారు. గతములో వారు చేసిన క్రియలు ఏవో అప్పుడప్పుడు లేక అక్కడక్కడ చేసినవికావు. వారు చేసిన కార్యములు నేటికాలమునకు కూడా నిలిచియుండే విధముగా నిర్వహించారు. కొన్ని ప్రత్యేక కార్యాలు చేయుట ద్వారా ఒక వ్యక్తియొక్క నిజమైన వ్యక్తిత్వము బయలుపర్చబడదు లేక దేవుని యెడల కొన్ని భారమైన విషయాలు నెరవేర్చుటద్వారా, కొందరు విలువనిచ్చునట్లు అవి. “మతపరమైన కార్యాలుగా పరిగణింపబడవు గాని, తోటి మానవులు ముఖ్యముగా నష్టమునకు మరియు అన్యాయమునకు గురైన వారికి ప్రేమతో చేసిన కార్యములు, దేవుని దృష్టిలో విలువైనదిగా ఎంచబడును” (మత్తయి 10:42; 25:31-46) ఉపకారమును, ధర్మమును చేయ మరచిపోకుడి (హెబ్రి 13:2-16) అని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు.

హెబ్రి 6:12 చూడుడి “మందబుద్ధి లేక సోమరితనము” కలిగి యుండరాదని విశ్వాసులు హెచ్చరింపబడిరి. అటువంటివారు విశ్వాసములో స్థిరులుగా ఉండలేరు. మరియు పతనమైపోయే ప్రమాదములో (హెబ్రి 5:11; 6:12) పడిపోతారు. తెలివితేటలతో విశ్వాసక్రియలను నెరవేర్చుట ద్వారా నిరీక్షణ కలుగదు గాని, ప్రేమ కార్యముల ద్వారా వివరించబడిన విశ్వాసము నిరీక్షణను సజీవముగా ఉంచును (రోమా 13:8-10).

విశ్వాసముతోను మరియు సహనముతోను దేవుని వాగ్దానములను వారసత్వముగా పొందినవారిని విశ్వాసులు అనుకరించాలని పౌలు బోధించుచున్నాడు. విశ్వాస లేమి వలన మరియు పట్టుదల లేని కారణమున వాగ్దానము చేయబడిన వాటిని వారసత్వముగా పొందలేకపోయిన, అరణ్యములో సంచరించిన ఇశ్రాయేలు తరము వారిని ఒక వ్యతిరేక ఉదాహరణగా పౌలు తన విశ్వాసులకు చూపించి వివరించాడు. అటు తరువాత విశ్వాసము మరియు ఓర్పుతో వారసత్వముగా వాగ్దానములను పొందిన అబ్రహామును పౌలు (హెబ్రి 6:13-15). తరతరములకు ఒక మాదిరిగా చూపించాడు. అది క్రమముగా పెరుగుతూ విశ్వాసమునకు మరియు ఓర్పు సహనమునకు శ్రేష్టమైన, మాదిరియైన యేసుతో హెబ్రి 12 లో ముగిసియున్నది. (హెబ్రి 12:1-4) కడవరి దినాల్లో విశ్వాసము ఓర్పు మరియు దేవుని ఆజ్ఞలను గైకొనుట వంటి లక్షణములు కలిగిన పరిశుద్ధులను గూర్చి (విశ్వాసులను గూర్చి) ప్రకటన 14:12 లె చూడగలము.

కొన్ని సందర్భాలలో మనము ప్రేమించుచున్న వారికి హెచ్చరిక మాటలను చెప్పవలసిన అవసరమున్నది. ఇతరులకు హెచ్చరికలను ఇచ్చుటను గూర్చి, వారిని ప్రోత్సహించుటను గూర్చి అపొస్తలుడైన పౌలు నుండి మనము ఏమి నేర్చుకొనగలము?

ఆత్మకు లంగరు యేసు

పౌలు మతభ్రష్టత్వములోనికి దిగజారిపోయిన వారికి వ్యతిరేకముగా హెచ్చరికలను జారీ చేస్తూ తోటి మానవుల యెడల ప్రేమ మరియు దేవుని యెడల విశ్వాసము కలిగియుండాలని ప్రోత్సహిస్తూ, క్రీస్తునందు మనకు దొరకు అభయమును గూర్చి వివరించుచున్నాడు.

హెబ్రి 6:17-20 చదువుడి. దేవుడు మనకు చేసిన వాగ్దానములకు ఏ విధముగా పూచీ ఇస్తున్నాడు?

అనేక రీతులలో దేవుడు తన వాగ్దానముల విషయమై మనకు అభయమిస్తున్నాడు. మొదటగా ప్రమాణము చేసిన వాగ్దానమును దృఢపరిచెను (హెబ్రి 6:17). ఇశ్రాయేలు యెడల దేవుడు చేసిన వాగ్దానములకు అబ్రహాము మరియు దావీదుకు ప్రమాణము చేసి చెప్పెను. ఇశ్రాయేలీయులు పోతపోసిన దూడ విగ్రహాన్ని పూజించినపుడు వారు చెడిపోయి త్రోవ తప్పినపుడు దేవునికి కోపము వచ్చి వారిని శిక్షించాలని తలంచినప్పుడు ఇశ్రాయేలును గూర్చి అబ్రహాముతో ఆయన చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొని వారిని క్షమించమని మోషే దేవునిని బ్రతిమాలెను (నిర్గమ 32:11-14) (ఆదికాం. 22:16 – 18) దేవుడు చేసిన ప్రమాణము మార్చుటకు శక్యము కాని దాని అర్ధము (రోమా 9:4; 11:28,29).

అదే రీతిగా దేవుని యెదుట ఇశ్రాయేలు పక్షమున దావీదుకు చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనమని ప్రార్ధించగా అందుకు దేవుడు “నా నిబంధనను నేను రద్దు:పరచును. నా పెదవులగుండ బయలువెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు, మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్దమాడను” (కీర్తన 89:34-37) చెప్పెను. నూతన నిబంధన ప్రకారము ఆ రెండు ప్రమాణములు అబ్రహాము సంతానమైన యేసు ద్వారా నెరవేరినవి. ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను (గలతీ 3:13-16; లూకా 1:31-33, 54,55).

రెండవదిగా దేవుడు తన కుడి పార్శ్వమున యేసును కూర్చుండబెట్టుట ద్వారా దేవుడు మనకు చేసిన వాగ్దానములకు అభయమిస్తున్నాడు. యేసు మనకన్నా ముందుగా, మన పక్షమున (విశ్వాసులకు చేసిన వాగ్దానమునుబట్టి) ప్రవేశించెను (హెబ్రీ 6:20) యేసు పరలోకమునకు ఎత్తబడుట ద్వారా మనందరికి దేవుని యొక్క రక్షణ నిశ్చయము అని బయలుపర్చబడుచున్నది. అనేకమంది పిల్లలను మహిమలోనికి నడిపించుటకు దేవుడు యేసును శ్రమల ద్వారా మహిమపర్చి మనందరి నిమిత్తమై మరణములోనికి నడిపించెను. (హెబ్రి 6:19). మనకు దేవుని యొక్క పరిపాలన గురించి చేసిన వాగ్దానము యేసు ద్వారా నెరవేరినది. మనకు అంతకు మించిన అభయము ఏమి కావాలి?

దేవుడు నీకు ఒక ప్రమాణము చేసెననే విషయమును గూర్చి ఆలోచించినపుడు నీకేమనిపిస్తుంది? నీవు అనర్హుడవైనను రక్షణ అభయముందని ఆ ఒక్క తలంపు నీకు ఏవిధముగా సహాయపడుతుంది?

అదనపు అధ్యయనము

ఎలెన్ జి వైట్ వ్రాసిన అపొస్తలుల కార్యములులోని “ప్రియ సహోదరుడైన యోహాను” పుటలు 539-545; యుగయుగాల ఆకాంక్షలోని “యూదయ” పుటలు 716-722 చదువుడి. క్రీస్తు యొద్దకు మెట్లు, పుట 43.

“యోహాను యేసును పోలి నడవాలని కోరుకున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమ ప్రభావములో అతడు తనను తాను తగ్గించుకొని వినయమును అలవర్చుకున్నాడు. తన స్వార్ధమును యేసునందు దాచబడెను. తన తోటి శిష్యులతో పోల్చుకున్నపుడు యోహాను యేసు యొక్క ఆశ్చర్యకరమైన జీవితములో ఉన్న శక్తికి అతడు పూర్తిగా లొంగిపోయాడు. యేసు యెడల అతనిలో ఉన్న ప్రేమ అతనిని క్రీస్తు ప్రక్కకు అతి సమీపముగా నడిపించెను. రక్షకుడు 12 మందిని ప్రేమించాడు. కాని యోహాను ఎక్కువగా క్రీస్తుకు స్పందించే స్వభావం కలవాడు. అతడు అందరికన్నా చిన్నవాడు మరియు యేసు యెడల చిన్నబిడ్డ కుండే స్వభావము కలిగినవాడు. అతని హృదయము యేసుకు ఎల్లపుడు తెరచియుంచేవాడు. అందుచేత అతడు క్రీస్తు యొక్క కనికరమునకు పాత్రుడయ్యాడు. అతని ద్వారా రక్షకుని యొక్క లోతైన విషయాలను ప్రజలకు బోధించడం జరిగింది” ఎలెన్ జి వైట్, అపొ. కార్య. పుట 544, 545.

చర్చించుకొనుటకు ప్రశ్నలు

  1. ప్రియ సహోదరుడైన యోహాను జీవితములోను, ఇస్కరియోతు యూదా జీవితములోను వీరిద్దరి మధ్య ఉన్న ప్రధానమైన బేధములను మనము వాక్యములో చూడగలము. యేసు, యోహాను, అతని సహోదరులైన యాకోబును చూసినపుడు వారిని బోయ నేర్గసు అనగా “ఉరిమెడు వారని” అర్ధముతో పిలిచాడు. ఎందువలన యోహాను యేసు యొక్క రూపములోనికి మార్పు చెందగలిగాడు. ఇస్కరియోతు యూదా, పరిశు ద్ధాత్మకు వ్యతిరేకముగా ఎందుకు పాపము చేసాడు? తేడా ఏమిటి?
  2. విశ్వాసులను వారి సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించమని యేసు ఆహ్వానించెను. సిలువను ఎత్తుకొని మరియు ఇతరుల దూషణలకు అప్పగించుకొనుట మధ్య ఉన్న తేడా ఏమిటి?
  3. మన జీవితములను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలని ఆయన ఎందుకు కోరుచున్నాడు? స్వేచ్ఛా చిత్తము మరియు రక్షణ మధ్య ఉన్న బాంధవ్యము ఏమిటి?